ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వెంటనే కేటాయించాలి: సిపిఎం
• జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 25: కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు సిపిఎం గాజులరామారం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు (డబుల్ బెడ్ రూమ్) వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్, గాజులరామారం డివిజన్ కార్యదర్శి ఎం.డి. జాకీర్ మాట్లాడుతూ.. గాజులరామారం సర్కిల్ పరిధిలోని పలు బస్తీల్లో పేదలు నివాసాల్లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు నేపథ్యంలో మరోసారి దరఖాస్తులు తీసుకుందని పేర్కొన్నారు.
అయితే గత తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించి, వందల సంఖ్యలో మాత్రమే ఇళ్లు మంజూరు చేయడం సమంజసం కాదని విమర్శించారు. సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిజమైన అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ఇల్లు లేని పేదలతో ఆక్రమించే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పసుల అంజయ్య, రావుల స్వాతి, ఆర్. లక్ష్మి, బురాన్, ముక్తార్, కృష్ణ, గోపి తదితరులు పాల్గొన్నారు.