బాచుపల్లిలో ఉత్కంఠభరితంగా బాక్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్
బాచుపల్లి (న్యూస్ విధాత్రి), మే 25: మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్, తక్ష డెంటల్, ఎన్ఎస్ అకాడమీ సౌజన్యంతో క్రాంతి నగర్ కాలనీ, బాచుపల్లిలో నిర్వహిస్తున్న “బాచుపల్లి బాక్స్ క్రికెట్ లీగ్” టోర్నమెంట్ ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 32 జట్లు పాల్గొనగా, వాటిని నాలుగు గ్రూపులుగా విభజించి ప్రతి జట్టుకు రెండు మ్యాచ్‌లు చొప్పున శని, ఆదివారాల్లో మొత్తం 32 మ్యాచ్‌లు నిర్వహించారు. మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, ప్రేక్షకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మొమెంటోలు, బహుమతులు అందజేశారు. అలాగే నిర్వాహకులు నిర్ణయించిన ప్రత్యేక పాయింట్లలో సిక్సర్, ఫోర్‌లు కొట్టిన ఆటగాళ్లకు కూడా ప్రత్యేక బహుమతులు ప్రదానం చేశారు.
లీగ్ దశ ముగిసే సరికి క్వార్టర్ ఫైనల్స్‌కు ఎనిమిది జట్లు అర్హత సాధించాయి. వాటిలో ఓజిస్ లెవెన్, ఔరీక్ బాక్స్ క్రికెట్ క్లబ్, అపెక్స్ ప్రిడేటర్స్, టైటాన్స్ యునైటెడ్, ఎస్ఈ నైట్స్, విక్టరీ బాయ్స్, ఎలైట్ స్కార్పియన్స్, రాయల్ బ్లూస్ జట్లు ఉన్నాయి. రానున్న శని, ఆదివారాల్లో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం ఆదివారం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం అందజేయనున్నారు. ఈ పోటీల విజయవంతమైన నిర్వహణలో హరితవనం కాలనీ యూత్ క్లబ్ సభ్యులు పవన్, సతీష్, అజయ్, మురళి, మణికంఠ, హర్షిత్, పునీత్ కీలక పాత్ర పోషించారు. అలాగే శ్రీకర్, కిషోర్ తమ చక్కటి కామెంట్రీతో మ్యాచ్‌లను మరింత ఆసక్తికరంగా మార్చి ప్రేక్షకులను అలరించారు.