కొంపల్లి జయభేరి కాలనీలో వీధి దీపాల కొరత
• చైన్ స్నాచింగ్ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు
• వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేసి పోలీస్ పహారా పెంచాలని డిమాండ్
కొంపల్లి (న్యూస్ విధాత్రి), మే 28 : కొంపల్లి జయభేరి కాలనీ పరిసర ప్రాంతాల్లో సరైన వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలనీలోని అంతర్గత రహదారులు, ఖాళీ ప్రదేశాల వద్ద చీకటి వాతావరణం నెలకొనడంతో మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల కాలనీలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికులను మరింత ఆందోళనకు గురిచేసింది. స్థానికుల వివరాల ప్రకారం.. జయభేరి కాలనీ ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో చాలా చోట్ల వీధి దీపాలు పనిచేయడం లేదని, కొన్ని ప్రాంతాల్లో అసలు దీపాలే లేవని తెలిపారు.
చీకటి కారణంగా అనుమానాస్పద వ్యక్తుల సంచారం పెరుగుతోందని, దీంతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరిగే అవకాశాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారని కాలనీవాసులు చెప్పారు. ఈ నేపథ్యంలో వెంటనే కాలనీలో సమగ్రంగా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పనిచేయని లైట్లను మరమ్మతు చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో పోలీస్ పహారా పెంచి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రజల్లో భద్రతాభావం కల్పించాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.