పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి : ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ చింతల మల్లేశం
• సత్ జ్ఞాన్ పాఠశాలలో అకాడమిక్ డైరెక్టర్ చింతల మానస్ యాదవ్ జన్మదిన వేడుకలు
• 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 28 : జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో ఉన్న సత్ జ్ఞాన్ పాఠశాలలో అకాడమిక్ డైరెక్టర్ చింతల మానస్ యాదవ్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ట్రస్మా ఉపాధ్యక్షులు, సత్ జ్ఞాన్ పాఠశాల అధినేత లయన్ చింతల మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. సమాజం పరిశుభ్రంగా ఉండేందుకు నిరంతరం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎప్పటికీ మరవలేనివని అన్నారు.

అలాగే సమాజంలోని నిరుపేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజులను ఆర్భాటాలకు పరిమితం చేయకుండా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో కేక్ కట్ చేసి సుమారు 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జేకే నగర్ లోని ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ అనాధాశ్రమంతో పాటు జీడిమెట్లలోని మరో అనాధాశ్రమంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు, వృద్ధులకు భోజనాలు అందించి మానవతా దృక్పథాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షురాలు చింతల విజయలక్ష్మి, అశోక్ యాదవ్, మానస్ స్నేహితులు, పాఠశాల, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.