ఘనంగా జాయింట్ కమిషనర్ వడ్డేపల్లి నర్సింహా పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు సమావేశం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 30: తొలుత మున్సిపల్ అనంతరం జిహెచ్ఎంసిలో గత 36 సంవత్సరాలుగా వివిధ హోదాలతో పాటు కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ గా విధులు నిర్వహించి ప్రస్తుతం జాయింట్ కమిషనర్ గా విశిష్టమైన సేవలందించిన వడ్డేపల్లి నర్సింహా పదవీ విరమణ పొందిన సందర్భంగా వీడ్కోలు సభను సహచరులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సుచిత్రలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన ఈ సభలో జీడిమెట్ల ఉప కమిషనర్ శంకర్ సింగ్, ఏఎంసీలు సునీత, హరిబాబు, కృష్ణ, ఏసిపి సురేందర్ రెడ్డి, డిఏవో పుష్పలత హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితం కేవలం పనితీరుతో మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వం, సహచరులతో కలిసి పనిచేసే ధోరణి, నిజాయితీ, క్రమశిక్షణలతో ముడిపడి ఉంటుందన్నారు. ఆ దిశగా జాయింట్ కమిషనర్ నర్సింహా అందరికీ ఆదర్శప్రాయులని, సమాజం పట్ల ఉన్న బాధ్యతతో ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. ఆయన పదవీకాలమంతా విధి నిర్వహణలో అత్యుత్తమ నిబద్ధతను ప్రదర్శించారన్నారు. సహచరులకు ఎల్లప్పుడూ అండగా నిలిచి, సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారని ప్రశంసించారు. ఆయన నూతన జీవిత అధ్యాయం మరింత సంతోషభరితంగా సాగాలని ఆకాంక్షించారు. సభలో ప్రసంగించిన అనేక మంది సహచరులు ఆయనతో గడిపిన అనుభవాలను స్మరించుకుని అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండే సహోద్యోగి, మానవతా విలువలను కాపాడే మంచి మనిషి అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

చివరిగా నర్సింహా మాట్లాడుతూ… తన పదవీ విరమణ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉద్యోగం నాకు అందించిన గుర్తింపు, సహచరుల ప్రేమ, మిత్రభావం జీవితాంతం మరిచిపోలేనివి. పదవీ విరమణ అంటే విశ్రాంతి మాత్రమే కాదని, సమాజానికి మరింత దగ్గర కావడానికి అవకాశమని భావిస్తున్నాను అన్నారు. మనం చేసే పని మీద పట్టుదల, కృషి ఉన్నప్పుడే ముందుకు సాగుతామన్నారు. అందరి సహాయ, సహకారాలు, సూచనలు, అభిమానంతోనే సంవత్సరాల తరబడి సర్వీస్ చేయగలిగానన్నాడు. తన సర్వీస్ కాలంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. పదవీకాలంలో ప్రధానంగా కుటుంబ సభ్యుల చేయూత ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం సహోద్యోగులు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరై అందరి శుభాకాంక్షలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఈ పాపమ్మ, సురేందర్ నాయక్ సుపరింటెండెంట్లు గిరిబాబు, జవహర్ లాల్, రాజశేఖర్, జిహెచ్ఎంసి లోని వివిధ సర్కిలలోని టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.