డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌పై ఏసీబీ దాడులు.. భారీ ఆస్తుల వెలికితీత

మేడ్చల్ (న్యూస్ విధాత్రి), మే 22:  మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలుచోట్ల శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 8 ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేపట్టి కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో వంశీ మోహన్‌కు సంబంధించి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ భూముల అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. గతంలో శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన సమయంలో వంశీ మోహన్ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని తన ఆధీనంలోకి తీసుకుని, తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అనంతరం ఆ భూమిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అప్పగించినట్లు ఏసీబీ గుర్తించింది. అలాగే ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో స్వీకరించినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు వంశీ మోహన్‌ను లోతుగా విచారిస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More