నీరు తాగుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 8: దేవర యంజాల్ గ్రామ పరిధిలోని వి-ట్రేస్ గోదాం పార్కింగ్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల ఒక గుర్తు తెలియని వ్యక్తి గోదాం వద్ద పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి తాగునీరు అడిగాడు. ఆ సమయంలో కార్మికులు భోజనం చేస్తుండటంతో కొద్దిసేపు వేచి ఉండమన్నారు. దీంతో అతను సమీపంలో ఉన్న నీటి కుళాయి వద్దకు వెళ్లి నీరు తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటనను గమనించిన కార్మికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది పరిశీలించగా, ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు ‘విస్టా’ అని ముద్రించబడిన టీ-షర్ట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. స్థానికంగా విచారణ జరుపగా అతను భిక్షాటన ద్వారా జీవనం సాగించే వ్యక్తి అయ్యి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం లభించింది. అయితే, అతని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని గుర్తింపు, మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More