కుత్బుల్లాపూర్ జోన్లో మూడు నెలల పాటు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు
– అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం, వర్షాకాల విపత్తులకు తక్షణ స్పందన
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 7: కుత్బుల్లాపూర్ జోన్లో అక్రమ నిర్మాణాల నియంత్రణ, రహదారి ఆక్రమణల తొలగింపు, పారిశుద్ధ్య మెరుగుదల, వర్షాకాల అత్యవసర పరిస్థితులకు వేగవంతమైన స్పందనతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ లలిత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో పట్టణ ప్రణాళిక నిబంధనలను కఠినంగా అమలు చేయడం, అలాగే వర్షాకాలంలో సంభవించే అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలకు వెంటనే స్పందించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్ఎఫ్టి) బృందాలను మూడు నెలల పాటు అన్ని సర్కిళ్లలో కేటాయించింది. ఇప్పటికే ప్రత్యేక యంత్రాలు, సిబ్బందితో కూడిన ఈ బృందాలు విధుల్లో చేరిన నేపథ్యంలో, అన్ని సర్కిల్ అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
• ప్రతి సర్కిల్‌కు ఒక్కో బృందం..
ప్రతి ఎస్ఎఫ్టి బృందానికి ఒక ప్రోక్లైనర్, ఒక ట్రాక్టర్, ఒక గ్యాస్ కట్టర్, ఒక ఎయిర్ కంప్రెసర్‌ను అందుబాటులో ఉంచారు. అదనంగా ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు ఆపరేటర్లు, ఇద్దరు కార్మికులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. విధుల్లో భద్రత కోసం సిబ్బందికి రక్షణ రిబ్బన్ టేపులు, రక్షణ బూట్లు, రేడియం యూనిఫాంలను కూడా అందజేశారు.
• టౌన్ ప్లానింగ్‌కే పరిమితం కాదు … వివిధ సేవలకు కూడా…
ఈ ప్రత్యేక బృందాలు కేవలం పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) పనులకే పరిమితం కాకుండా, వివిధ విభాగాలకు అవసరమైన చోట వినియోగించాలని ఆదేశించారు.
టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, రహదారి ఆక్రమణల తొలగింపు, స్థలాల శుభ్రపరిచే పనులు చేపట్టనున్నారు. పారిశుద్ధ్య విభాగానికి మద్దతుగా చెత్త పేరుకుపోయే ప్రధాన ప్రాంతాల శుభ్రపరిచే పనులు, భారీ నిర్మాణ వ్యర్థాల తొలగింపు, మెగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో సహకారం అందించనున్నారు. వర్షాకాలం, విపత్తుల నిర్వహణలో భాగంగా నీటి నిల్వల తొలగింపు, రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించడం, ప్రమాదకర నిర్మాణాలను తాత్కాలికంగా భద్రపరచడం వంటి అత్యవసర పనులను వేగంగా నిర్వహించనున్నారు.
• జీరో ఐడిల్ టైమ్ విధానాన్ని కచ్చితంగా పాటించాలి..
ప్రతి సర్కిల్‌కు సంబంధించిన పట్టణ ప్రణాళిక ఏసీపీలు కేటాయించిన ఫీల్డ్ సూపర్వైజర్లతో కలిసి వారం రోజుల కార్యాచరణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. అలాగే యంత్రాలు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా ఉండకుండా “జీరో ఐడిల్ టైమ్” విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ, అవసరానికి అనుగుణంగా అన్ని విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించాలని స్పష్టం చేశారు.