బీఎల్వోలు, సూపర్వైజర్లు ఏం చేస్తున్నారు..? ఆపరేటర్లకు అవగాహన ఎందుకు కల్పించలేదు?
• 17 రోజులు గడిచినా డేటా ఎంట్రీలో పురోగతి లేదు
• క్షేత్రస్థాయిలో పరిశీలన శూన్యం
• బీఎల్వోలు, సూపర్వైజర్ల తీరుపై ఈఆర్వో పింకేష్ కుమార్ ఆగ్రహం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 12: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమై 17 రోజులు గడిచినా క్షేత్రస్థాయిలో ఆశించిన పురోగతి కనిపించకపోవడంతో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) పింకేష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఎల్వోలు, సూపర్వైజర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డేటా ఎంట్రీలో జరుగుతున్న జాప్యంపై సంబంధిత అధికారులను నిలదీశారు. ఈ మేరకు ఆయన పలు ప్రాంతాల్లో సర్ ప్రక్రియ తీరును స్వయంగా శనివారం పరిశీలించారు.
• అధికారులు ఏం చేస్తున్నారు..?
దీనిలో భాగంగా ప్రసూన నగర్ సీనియర్ సిటిజన్స్ భవనంలో ప్రక్రియను పరిశీలించి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమై 17 రోజులు అవుతున్నా ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదు? బీఎల్వోలు, సూపర్వైజర్లు ఏం చేస్తున్నారు? ఆపరేటర్లకు సరైన అవగాహన ఎందుకు కల్పించలేదని అధికారులపై మండిపడ్డారు.
• అవగాహన లోపంతో జాప్యం…
ఫీల్డ్‌లో సేకరించిన వివరాలు సరిగ్గా లేకపోవడం, అవకతవకల కారణంగా సకాలంలో పోర్టల్‌లో నమోదు కాకపోవడంతో డేటా ఎంట్రీలో తీవ్ర జాప్యం ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేటర్లకు తగిన మార్గదర్శకాలు, శిక్షణ అందకపోవడం కూడా ఆలస్యానికి కారణమని అసహనాన్ని ఈఆర్వో వ్యక్తం చేశారు.
• యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి..
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, డేటా ఎంట్రీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీఎల్వోలు, సూపర్వైజర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ పనుల పురోగతిని సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ వంటి కీలక ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యం సహించబోమని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ఈఆర్వో పింకేష్ కుమార్ హెచ్చరించారు.