సత్ జ్ఞాన్ పాఠశాలలో వైభవంగా బోనాల ఉత్సవాలు
• ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 8: కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి వెంకటేశ్వరనగర్‌లోని సత్ జ్ఞాన్ పాఠశాలలో బోనాల ఉత్సవాలను వైభవంగా శనివారం నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మన వారసత్వ నాగరికతను సుస్థిరంగా అందించవచ్చని అన్నారు. విద్యార్థుల సంపూర్ణ మానసిక వికాసానికి దోహదపడే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్సై ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన బోనాల పండుగను, ముఖ్యంగా హైదరాబాద్ నగర సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన ఈ ఉత్సవాలను సత్ జ్ఞాన్ పాఠశాలలో నిర్వహించడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు.

పాఠశాల కరస్పాండెంట్ లయన్ చింతల మల్లేశం మాట్లాడుతూ.. సత్ జ్ఞాన్ పాఠశాల స్వచ్ఛమైన జ్ఞానాన్ని అందిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించిన నృత్యరూపకం, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, భవిష్యవాణి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జీడిమెట్ల ఏఎస్ఐ ప్రేమ్ కుమార్, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ చింతల మానస్ యాదవ్, డైరెక్టర్ చింతల ఆకాంక్ష, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.