ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యం. – సిఎంసి కమిషనర్ డా. జి. సృజన
• ‘వన్ డే–వన్ వార్డ్’లో భాగంగా సూరారం వార్డులో పర్యటన
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 11: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ‘వన్ డే–వన్ వార్డ్’ కార్యక్రమంలో భాగంగా గాజులరామారం సర్కిల్ పరిధిలోని సూరారం వార్డులో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డా. జి. సృజన మంగళవారం పర్యటించారు. కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ తో కలిసి వార్డులోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్‌లో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల (ఆర్ డబ్ల్యూ ఏ) ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానికులు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, పార్కుల ఆధునీకరణ, వీధి దీపాల మరమ్మతులు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వర్షపు నీటి కాలువల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణల తొలగింపు, కాలనీల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టడం వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లను విస్తృతంగా చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. స్థానికుల వినతులపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ ప్రజలు సమర్పించిన అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో త్వరితగతిన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గాజులరామారం సర్కిల్ ఉప కమిషనర్ యు. వెంకట్ రాములు, ఏఎంసీ ప్రమీల, డీఈఈ (ఎస్ డబ్ల్యూ ఎం) నిఖిల్ రెడ్డి, ఏసీపీ సుమిత్ర, డీఈఈ (ఇంజినీరింగ్) మహదేవ్ అనురాగ్, ప్రాజెక్టు అధికారి మల్లికార్జున, సూరారం సిఐ బాలరాజుతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.