భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
• సాయి లక్ష్మి ప్రైడ్ అపార్ట్మెంట్లో చక్కటి భజనలతో ఆకట్టుకున్న అపార్ట్మెంట్ వాసులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 16: పద్మానగర్ ఫేజ్-2, రోడ్ నంబర్-18లోని సాయి లక్ష్మి ప్రైడ్ అపార్ట్మెంట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను అపార్ట్మెంట్ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హారతులతో పాటు భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు నిర్వహించిన చక్కటి భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని గణనాథుని భక్తిగీతాలను ఆలపించారు.
దీంతో అపార్ట్మెంట్ ప్రాంగణం భక్తిభావంతో మార్మోగింది. కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొన్న అపార్ట్మెంట్ వాసులు గణనాథుని ఆశీస్సులతో అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు అపార్ట్మెంట్ వాసుల మధ్య ఐక్యత, సోదరభావాన్ని చాటేలా కొనసాగుతున్నాయి.