విద్యా సేవకు ఘన గౌరవం.. ఉత్తమ ఉపాధ్యాయుడిగా లయన్ చింతల మల్లేశం
• నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలు
• ప్రశంసా పత్రం, మెమొంటో అందజేసిన మండల విద్యాధికారి జెమిని భూషణ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 16: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐడీపీఎల్లోని హోటల్ జైస్ ఇన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్లోని సత్ జ్ఞాన్ పాఠశాల ప్రిన్సిపాల్ లయన్ చింతల మల్లేశంకు అరుదైన గౌరవం లభించింది. ఆయనను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసి కుత్బుల్లాపూర్ మండల విద్యాధికారి జెమిని భూషణ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి జెమిని భూషణ్ మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మల్లేశం విద్యారంగంలో ఉన్నత విలువలను పాటిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. విద్యాబోధనతో పాటు సమాజ సేవలోనూ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు మల్లేశం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా లభించిన ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని లయన్ చింతల మల్లేశం పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యమని, విద్యారంగంలో మరింత సేవ చేయడానికి ఈ పురస్కారం ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, విద్యాశాఖ ప్రతినిధులు, ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన గ్రహీతలు, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు.